‘బాహుబలి’ సినిమా సక్సెస్‌తో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు ప్రభాస్. మరోవైపు ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడు ప్రశాంత్‌నీల్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్, ప్రశాం త్ నీల్ కాంబినేషన్లో సినిమా అంటే ఓ సెన్సేషన్. అలా ప్రభాస్, ప్రశాంత్‌నీల్ కలిసి ‘సలార్’ సిని మాను స్టార్ట్ చేశారు. ‘సలార్’ అనౌన్స్మెంట్తోనే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే ప్రభాస్ గత రెండు చిత్రాలు ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ నిరాశపరిచాయి. ఈ తరుణంలో వస్తున్న ‘సలార్’ సినిమా హిట్ కొట్టిందా? ప్రశాంత్‌నీల్ హిట్ మ్యూజిక్ కంటిన్యూ అయ్యిందా? ‘సలార్’ సినీ లవర్స్ అంచనాలను, ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించిన హిట్ ప్రభాస్‌కు దక్కిందా? రివ్యూలో చూద్దాం.
కథ
Prabhas and PrashanthNeel Salaar CeaseFire: ఖాన్సార్ ప్రపంచంలో దేవరథా సలార్ రైసాని అలియాస్ దేవా, వరదరాజ మన్నార్ అలియాస్ వరద (పృథ్వీరాజ్ సుకుమారన్) ప్రాణస్నేహితులు. ఖాన్సార్ కర్త(రాజు) కోసం జరిగే కోట్లాటలో దేవా తండ్రి ధార హత్య చేయబడతాడు. దీంతో దేవా తల్లిని సొంతం చేసుకోవాలనుకుంటాడు నారంగ్. వారి ఇంటిపై అర్థరాత్రి దాడి చేస్తాడు. ఈ సమయంలో వరద అక్కడికి వస్తాడు. తన తండ్రి రాజమన్నార్ ద్వారా తనకు వాటాగా ఇచ్చిన ఖాన్సార్(మొత్తం 101) ఓట్లు లోని ఓ భాగాన్ని నారంగ్‌కు ఇస్తానని, దేవాను, ఆమె తల్లిని వదిలిపెట్టాలని అంటాడు. దీంతో నారంగ్ అక్కడి నుంచి వెళ్లి పోతాడు. అలాగే దేవ, అతని తల్లి కూడా ఖాన్సార్ నుంచి బయటకు వెళ్తారు. అయితే వరదాకు ఏ ఆపద వచ్చిన తాను ఖాన్సార్‌కు వచ్చి సహాయం చేస్తానని దేవా అంటాడు..దేవా, వరదలు ఇద్దరు చిన్నతనంలో ఉన్నప్పుడు 1985లో జరిగే కథ ఇది.
ఇక 2017.. తన తల్లి ఆస్తికలను ఇండియాలోని గంగానదిలో కలిపేందుకు తండ్రికి చెప్పకుండానే న్యూయార్క్ నుంచి వారణాసి వస్తుంది ఆద్య(శ్రుతీహాసన్). కానీ రాధారమా మన్నార్(సీయా రెడ్డి) నుంచి ఆద్యకు ప్రాణహని ఉంటుంది. అయితే ఇచ్చిన మాట కోసం ఆద్య రక్షణ తీసుకుంటాడు దేవా. ఈ క్రమంలో ఖాన్సార్‌కు దేవా మూడోసారి వెళ్లాల్సి వస్తుంది. అయితే రాధారమా మన్నార్ ప్రధాన టార్గెట్ ఆద్య కాదు..దేవా అని తెలుస్తుది. ఖన్సార్ నుంచి చిన్నతనంలోనే వెళ్లిపోయిన దేవా రెండోసారి వరద పిలుపు మేరకు ఖన్సార్ ఎందుకు వెళ్లాడు? రాజమన్నార్ మొదటి భార్య సంతానం రాధారామమన్నార్, రుద్ర(‘కేజీఎఫ్’ గరుడ..ఫేమ్ రామచంద్రరాజు) లకు….రాజమన్నార్ రెండో భార్య కుమారులు వరద, బిజ్జులకు మధ్య ఉన్న గొడవలు ఏంటి? అసలు…ఖన్సార్ కర్త కుర్చి కోసం అక్కడ ఉన్న శౌర్యంకా, మన్నార్, ధనియార్ తెగల నాయకులు ఏ విధమైన రాజకీయాలు చేశారు? శౌర్యాంకా తెగకు దేవాకు ఉన్న సంబంధం ఏమిటి? తన ప్రాణస్నేహితుడు దేవాతో వరదకు ఎందుకు శత్రుత్త్వం ఏర్పడుతుంది? అనే కొన్ని ప్రశ్నలకు సమాధానంగా ‘సలార్:సీజ్ఫైర్’ కథ నడుస్తుంది.
విశ్లేషణ
ఖాన్సార్ సిటీలో ఉన్న ఇద్దరు చిన్ననాటి స్నేహితులు విడిపోయే పరిస్థితుల నేపథ్యంలో ‘సలార్:సీజ్ఫైర్’ కథ మొదలువుతుంది. ఇది పూర్తి కాగానే…కథ వెంటనే 2023కి జంప్ అవుతుంది. ఆద్యను రాధా రామమన్నార్ నుంచి కాపాడే సన్నివేశాలతోనే తొలిభాగం ముగుస్తుంది. అయితే ఈ క్రమంలో వచ్చే కోల్‌మైన్ ఫైట్, ఇంట్రవెల్ ఫైట్స్ ప్రభాస్ స్థాయి కటౌట్‌ను దర్శకుడు నీల్ ఎంతబాగా వాడుకున్నాడో, తన స్టైల్ ఆఫ్ యాక్షన్‌తో ప్రభాస్ పాత్ర దేవాకు ఎలాంటి ఎలివేషన్స్‌ను ఇచ్చాడో తెలుస్తుంది. ఈ ఫైట్స్ బాగుంటాయి. అయితే ఇక్కడ్నుంచి అంటే..సెకండాఫ్ మొదలు కాగానే కొంతసేపు ప్రభాస్ కనిపించడు. అయితే ఫస్టాఫ్‌లో కనిపించని పృధ్వీరాజ్ సెకండాఫ్‌లో ఎంట్రీ ఇస్తాడు. ఖన్సార్ సిటీ, ఇక్కడి రాజమన్నార్ పరిపాలన, మన్నార్, ధనియార్, శౌర్యంకా తెగల ప్రస్తావన, ఇక్కడి నిబంధనలతో కూడిన సంగతులు, ఇక్కడి పాత్రల పరిచయాలతో దాదాపు ఇరవైనిమిషాలు గడిచిపోతాయి. ఎప్పుడైతే ప్రభాస్, పృథ్వీరాజ్‌ల కాంబినేషన్ సీన్స్ మొదలవుతాయో, కథలో కాస్త వేగం పెరిగినట్లుగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఖాన్సార్లోని ఓ భాగం మహారాలో వచ్చే ఓ యాక్షన్ సీన్ (ఛత్రపతి సినిమాలోని ఇంట్రవెల్ ఫైట్గుర్తుకొస్తుంది), ఖాన్సార్‌లో మహారాకు జరిగిన ఘటనకు బదులుగా నిబంధనల ప్రకారం ప్రభాస్, పృథ్వీరాజ్‌లను శిక్షించాలనే నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్ బాగుంటాయి. ఇక చెర నుంచి పృథ్వీరాజ్,ప్రభాస్‌లు బయటకు వచ్చి చేసే యాక్షన్ మరో ఫైనల్ హైలైట్. ఇలా సెకండాఫ్ అంతా యాక్షన్, ఖన్సార్ కన్ఫ్యూజన్ డ్రామాతోనే నడుస్తుంది. క్లైమాక్స్‌లో ఓ ట్విస్ట్‌తో కథ ముగిసి, ‘సలార్’ రెండో పార్టు..‘సలార్:శౌర్యాంక పర్వం’ మొదలైనట్లుగా చూపించే సన్ని వేశంతో ‘సలార్:సీజ్ఫైర్’ కథ ముగుస్తుంది. కానీ స్క్రీన్ ప్లే ప్రకారం డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో కథ నడవడం, ఖన్సార్ తెగలు, రూల్స్, సీజ్ఫైర్ ఓటింగ్ కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించినా శ్రద్దగా ఆలకిస్తే ప్రశాంత్‌నీల్ స్క్రీన్ ప్లే కనిపిస్తుంటుంది. అయితే…ఇన్ని క్యారెక్టర్స్ ప్రస్తావన ‘కేజీఎఫ్2’ను గుర్తుకు తీసుకురాక మానదు.
ఎవరు ఎలా చేశారు
సినిమాలో ప్రభాస్ పాత్రకు యాక్షన్ తప్ప నటించడానికి ఆస్కారం లేదు. చెప్పాలంటే..దాదాపు మూడు గంటలు ఉన్న సినిమాలో ప్రభాస్‌కు పట్టుమని పది డైలాగ్స్ కూడా లేవు. శ్రుతీహాసన్ పాత్ర థియేటర్లోనిఆడియన్కు ఏ మాత్రం తీసిపోదు. కానీ యాక్టింగ్ స్కోప్ లని పాత్ర ఇది. పృథ్వీరాజ్, ఈశ్వరీరావు, సీయారెడ్డిలకు మంచి రోల్స్ పడ్డాయి. తొలిభాగాన్ని ఈశ్వరీరావు పాత్ర డ్రైవ్ చేస్తే, మలిభాగంలో పృథ్వీ రాజ్, సీయారెడ్డి పాత్రల డెప్త్ కనిపిస్తుంది. భారవగా బాబీసింహా, బాబాగా టీనూ ఆనంద్, ఓబులమ్మ పాత్రలో ఝాన్సీ వారి పాత్రల పరిధిమేరకు చేశారు. ప్రశాంత్‌నీల్ కథ, ఖన్సార్ కహానీ బాగానే ఉన్నప్పటికీని, కథలో లీనమవ్వడానికి ఆడియన్‌కు కాస్త కన్ప్యూజన్గానే ఉంది. కావాలని కాక పోయిన..ప్రభాస్ గత చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. హీరో ఎక్కడో ఏదో చిన్న పని చేసుకుంటు ఉండటం,అతనికో పెద్ద ప్లాష్‌బ్యాక్..ఇదంతా రోటీనే. కానీ స్క్రీన్‌పై ప్రభాస్ కటౌట్, అన్బుఅరివిల యాక్షన్ డిజైన్ వల్ల ఇవేవి గుర్తుకురాకుండా చేస్తాయి. కామెడీ, రొమాన్స్, ఎనర్జిటిక్ సాంగ్స్ ఆశించి అయితే ‘సలార్’కు రాలేము. కథ కూడా ఈ తరహాది కాదు. అలాగే కథలో బోలెడు అంటే బోలెడు ప్రశ్నలు మిగిలిపోతాయి. వీటి సమాధానలు సెకండ్‌పార్ట్‌లో ఉంటాయోమో..చూడాలి. ఇక ప్రశాంత్‌నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవిబస్రూర్ మరోసారి మాంచి మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ఎలివేషన్, ఖన్సార్ సిటీ సన్నివేశాల నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ భువన్ గౌడ కెమెరా వర్క్ బాగుంది. విజయ్ కిరగందూర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.ఎడిటర్ ఉజ్వల్ ఇంకాస్త శ్రద్ధపెట్టి ఉండా ల్సింది.