Chiranjeevi – Director HarishShnkar : ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్స్ గుర్తున్నాయి కదా!. ఈ సినిమా ప్రమోషన్ కోసం చిరంజీవి (Chiranjeevi ), రామ్‌చరణ్, కొరటాల శివలను ఇంటర్వ్యూ చేశారు దర్శకుడు హరీష్‌శంకర్ (HarishShnkar) . ఈ క్రమంలో ‘దొంగమొగుడు’, ‘రౌడీ అల్లుడు’ తరహా సినిమాలు చేయాలని ఉందని, చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో హరీష్‌శంకర్ ఆ అవకాశం తనకు ఇవ్వాలన్నట్లుగా పరోక్షంగా చిరంజీవిని విన్నవించుకున్నారు. హరీష్‌శంకర్ విన్నపాన్ని చిరంజీవి స్వీకరించినట్లు ఉన్నారు. దర్శకుడు హరీష్‌శంకర్‌తో ఓ సినిమా చేసేందుకు చిరంజీవి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నట్లుగా సమాచారం. చిరంజీవి తనయ సుష్మితా కొణిదెల ఈ సినిమాకు మరో నిర్మాత. బీవీఎస్ రవి ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. ఈ సినిమాను గురించి అతి త్వరలోనే ఓ ప్రకటన రానుంది.
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చేస్తున్నారు. జనవరి 10 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకుడు. అయితే వశిష్ఠ, హరీష్ శంకర్‌లతో ఏక కాలంలో చిరంజీవి సినిమాలను చేస్తారా? లేక విశ్వంభర పూర్తి చేసిన తర్వాత హరీష్‌శంకర్ డైరెక్షన్లో సెట్స్‌కు వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ చేస్తున్నాడు హరీష్‌శంకర్. హిందీ హిట్ అజయ్‌దేవగన్ ‘రైడ్’కు తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఒక పవన్‌కళ్యాణ్‌తో హరీష్‌శంకర్‌కు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే సినిమా కమిట్మెంట్ ఉన్న సంగతి తెలిసిందే.