Chiranjeevi Vishwambhara: చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ సినిమాకు ‘విశ్వంభర’ టైటిల్‌ను ఖరారు చేశారు. కళ్యాణ్‌రామ్‌తో ‘బింబిసార’ వంటి హిట్ తీసిన వశిష్ట ఈ సినిమాకు దర్శకుడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ముందుగా చిరంజీవి పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రెండు మైనర్ షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయింది. అయితే ‘విశ్వంభర’ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేస్తామని 2024 సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు మేకర్స్. సంక్రాంతికి విడుదలైన హిట్ సాధించిన చిరంజీవి సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కాకపోతే ‘విశ్వంభర’ చిత్రం 2025లో విడుదల అవుతుంది కాబట్టి 2024లో సిల్వర్‌స్క్రీన్‌పై చిరంజీవిని చూసే అవకావం ఉండదు ఆయన అభిమానులకు. 2022లో ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’తో రెండుసార్లు, 2023లో ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళాశంకర్’తో రెండు సార్లు చిరంజీవి సందడి చేశారు. కానీ ఈ ఏడాది చిరంజీవి సిల్వర్‌స్క్రీన్ పై కనిపించే అవకాశాలు ఆల్మోస్ట్ లేనట్లే అని తెలుస్తోంది. ఇది ఆయన అభిమానులకు కాస్త చేదువార్తే.
హీరోయిన్గా త్రిష?
విశ్వంభర సినిమాలో హీరోయిన్గా మృణాల్‌ఠాకూర్, అనుష్కాశెట్టి వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ త్రిష ఫైనలైజ్ అయినట్లు తెలిసింది. ‘స్టాలిన్’ (2006) సినిమా లో కలిసి నటించారు చిరంజీవి, త్రిష. ఆ తర్వాత చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో త్రిషను తొలుత హీరోయిన్గా తీసుకున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల
‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ రోల్ చేశారు. కానీ ఆచార్య విడుదల తర్వాత హీరోయిన్గా కాజల్ అగర్వాల్ రోల్ ఎడిటింగ్‌లో పో యింది. ఇది వేరే కథ. మరి..విశ్వంభరలోనైనా చిరంజీవితో త్రిషకు క్రియేటివ్ డిఫరెన్సెస్ రాకూడదనే కోరుకుందాం.
మారిన నెంబర్
చిరంజీవి కెరీర్లో 157వ సినిమాగా ‘విశ్వంభర’ ప్రకటన వచ్చింది. చిరంజీవి 156వ సినిమాను ఆయన పెద్ద కుమార్తె సుష్మితాకొణిదెల నిర్మించాల్సింది. ఈ సినిమాకు కళ్యాణ్‌కృష్ణ పేరు దర్శకుడిగా వినిపించింది. తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ సడన్‌గా ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు చిరంజీవి 156వ సినిమాగా ‘విశ్వంభర’ తెరకెక్కుతుంది. అలాగే ‘చలో’, ‘భీష్మ’ వంటి హిట్స్ తీసిన వెంకీ కుడుములతో కూడా చిరంజీవి ఓ సినిమా చేయాల్సింది. డీవీవీ దానయ్య నిర్మాత. కానీ ఈ సినిమా ఆల్మోస్ట్ క్యానిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే…ఇటు చిరంజీవి, అటు వెంకీ కుడుముల ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీగా ఉంటున్నారు. అలాగే చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా చేస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. బోయపాటి శ్రీను పేరు కూడా వినిపిస్తోంది ఈ లిస్ట్‌లో.
ఒత్తిడిలో చిరంజీవి?
చిరంజీవి కాస్త ఒత్తిడిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన సమకాలీకులైన రజనీకాంత్ ‘జైలర్’తో, కమల్ హాసన్ ‘విక్రమ్’తో, బాలకృష్ణ ‘అఖండ, వీరసింహారెడ్డి’తో, నాగార్జున ‘బంగార్రాజు, నా సామిరంగ’ వంటి హిట్స్ కొడుతున్నారు. అయితే గడిచిన నాలుగు సంవత్సరాల్లో చిరంజీవికి ఒక్క ‘వాల్తేరు వీరయ్య’ తప్ప మరో సాలిడ్ హిట్ లేదు. పైగా ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర చేశారు ఆల్మోస్ట్ మల్టీస్టారర్ అన్నట్లు. దీంతో సోలో హీరోగా ఓ మంచి మాసీ హిట్ కొట్టాలనే కసిలో ఉన్నారు చిరంజీవి.