DilRaju Vs MythriMovieMakers: సినిమా పంపిణీరంగంలో నైజాం ఏరియాలో ఒకప్పుడు ‘దిల్’ రాజుది ఏకాఛత్రాదిపత్యం. ఆయన మాటే శాసనం. ఆయన సినిమా చూసి, జడ్జ్చేసి రేట్ నిర్ణయిం చేవారట. దాదాపు రెండు దశాబ్దాల పాటు నైజాంలో ‘దిల్’ రాజుకు ఎవరూ చెక్ పెట్టలేకపోయారు. ఇటీవల వరంగల్ శీను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్‌గా కాస్త దూకుడు చూపించాడు. రెండుమూడు హిట్స్ పడ్డాయి. అయితే తన సినిమాకు సంక్రాంతి సమయంలో థియేటర్స్ దొరకలేదని ఈ వరంగల్ శీను కూడా 2021 సంక్రాంతి సమయంలో వాపోయారు. ఆ నెక్ట్స్ ‘లైగర్’ సినిమాతో వరంగల్ శీను చావుదెబ్బతిన్నారు. ‘లైగర్’ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో వరంగల్ శీను డిస్ట్రిబ్యూటర్‌గా పని చేయడం మానేశారట. అప్పటికే తెలుగు సినీ పరిశ్రమ రంగంలో అగ్రశ్రేణి నిర్మాణసంస్థగా అవతరిస్తున్న మైత్రీమూవీమేకర్స్ వారికి డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ఇబ్బందులు ఎదురైయ్యాయి. వారికి నైజాంలో ‘దిల్’రాజు తప్ప మరో ఆప్షన్ లేదు. ‘దిల్’రాజుకు, మైత్రీవారికి కొన్ని రోజులు బాగానే మైత్రీ సాగింది. కానీ మైత్రీవారు నిర్మించిన ఓ స్టార్ హీరో సినిమా డిస్ట్రిబ్యూషన్ రేటు విషయంలో ఏకాభిప్రాయం కుదర్లేదు. నైజాం ఏరియాలో మరో ఆప్షన్‌ను వెతికారు మైత్రీమూవీమేకర్స్. కానీ లాభం లేకపోయింది. ఏదైతే అది అయ్యిందని, వెంటనే ఓ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌ను స్టార్ట్ చేశారు. ముందుగా తమ నిర్మాణసంస్థలోని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. మెల్లగా ఈ రంగంలో పట్టుసాధించారు. దశాబ్ధాలుగా దిల్ రాజు కు మరో ఆప్షన్‌గా ఎదురుచూస్తున్న కొందరు డిస్ట్రిబ్యూటర్స్‌కు మైత్రీవారు కనిపించారు. దీంతో వారు మైత్రీమూవీమేకర్స్‌తో చేతులు కలిపారు. ఇక్కడ దిల్ రాజుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు సొంతనిర్మాణసంస్థలోని సినిమాల పంపిణీలో లాభాలు చూసిన మైత్రీవారు ఇతర సంస్థల్లో నిర్మించబడిన సినిమాలను కూడా పంపీణీ చేయాలని నిర్ణయించు కున్నారు. అప్పట్నుంచి నైజాం ఏరియాలో సినిమాల పంపీణీ విషయంలో ‘దిల్’ రాజు వర్సెస్ మైత్రీమూవీ మేకర్స్ అన్నట్లుగా సాగు తోంది. ‘మీటర్’, ‘అమిగోస్’, ‘హ్యాపీబర్త్ డే’ వంటి సినిమాలను పంపిణీ చేసి నష్టాలను చవిచూసిన మైత్రీకి…ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్’ సినిమాల లాభాలు గట్టిగానే ఉన్నాయి.
రీసెంట్గా ‘సలార్’ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ‘దిల్’ రాజు, మైత్రీమూవీ మేకర్స్ మధ్య గట్టిపోటీ జరిగిందట. కానీ ఫైనల్‌గా ‘సలార్’ నైజాం హక్కులను మైత్రీమూవీస్ దక్కించుకుంది. డిసెంబరు 29న విడుదల కానున్న ‘డెవిల్’ సినిమా హక్కులను దక్కించుకున్నారు దిల్ రాజు. ఇక వీరి పోటీ సంక్రాంతి సినిమాల విషయంలోనూ కనిపిస్తోంది. వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’, మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’, తేజాసజ్జా–హనుమాన్, రవితేజ ‘ఈగల్’ సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కాను న్నాయి. ‘సైంధవ్’, ‘గుంటూరుకారం’ సినిమా నైజాం హక్కులను ‘దిల్’ రాజు దక్కించుకున్నారు. ఇక సంక్రాంతి రేసు నుంచి హను–మాన్ తప్పుకోవాలన్నట్లుగా ‘దిల్’ రాజు పరోక్షంగా ప్రయత్నాలు చేశారనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ‘హను–మాన్’ హక్కులను మైత్రీమూవీ మేకర్స్ దక్కించుకున్నారు. దీంతో ‘హను–మాన్’ సినిమాకు థియేటర్స్‌కు డోకా ఉండబోదని తెలుస్తోంది. ఎలా అయితేనేం ఎన్ని ఒత్తిళ్లు ఎదరైనా సంక్రాంతి రేసు నుంచి హను–మాన్ తప్పుకోలేదు. అలా సంక్రాంతి రేసులో హను–మాన్ గెలిచాడు. ఒక థియేటర్స్‌లో ప్రేక్షకులు గెలిపిస్తారని దర్శకుడు ప్రశాంత్‌వర్మ అండ్ టీమ్ చెబుతోంది. మరోవైపు ‘దిల్’ రాజు, మైత్రీల మధ్య కూడా పోటీ కనిపిస్తోంది.