Kollywood: రీసెంట్ టైమ్స్‌లో టాలీవుడ్లో తమిళ హీరోల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘సార్’ చేసి, 100 కోట్ల హిట్ కొట్టాడు. వంశీపైడిపల్లితో విజయ్ ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’గా హిటై్టయ్యాడు. విష్ణువిశాల్ ‘ఎఫ్ఐఆర్’, ‘మట్టికుస్తీ’ సినిమాలను నిర్మించారు రవితేజ. ఇలా తమిళ హీరోలు తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు పరిశ్రమ నిర్మాతలు కూడా అక్కడి స్టార్ హీరోలకు భారీ పారితోషికాలను ముట్టజెప్పి, సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది.
మైత్రీమూవీ మేకర్స్‌కు ఓ సినిమా చేసేందుకు అజిత్ రెడీ అయ్యాడు. ఆల్రెడీ ఏషియన్ సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌లతో కలిసి ధనుష్ ఓ సినిమా చేస్తు న్నాడు. దళపతి విజయ్‌తో సినిమా చేసేందుకు నిర్మాత డీవీవీ దానయ్య రెడీ అవుతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. రజనీకాంత్‌తో ఓ సినిమా చేసేందుకు ‘దిల్’ రాజు ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గీతా ఆర్ట్స్‌లో సూర్య సినిమా ఉంటుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సూర్య హీరోగా చేస్తున్న ‘కంగువ’కు తెలుగు నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్ ఓ నిర్మాత అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కమల్‌హాసన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కల్కి2898 ఏడీ’ని వైజయంతీమూవీస్ నిర్మిస్తోంది. జీవా హీరోగా నటిస్తున్న ‘యాత్ర 2’ను శివ మేక, వి సెల్యూలాయిడ్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నారు.
ఇలా తెలుగు ప్రముఖ నిర్మాణసంస్థలు తమిళ హీరోలతో సంప్రదింపులు జరపడానికి కారణాలు లేకపోలేదు. తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలంటూ ఏడాదికి ఒకటి రెండు సినిమాలే చేస్తున్నారు. దీంతో నిర్మాణసంస్థలు కొత్త సినిమాల కోసం భారీ పారితోషికాల ఆఫర్స్‌తో తమిళ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక కోలీవుడ్ దర్శకులకు కథలు చెప్పిన తెలుగు దర్శకుల లిస్ట్ కూడా చాలానే ఉంది. రజనీకాంత్‌ను కలిశారు గోపీచంద్‌మలినేని. సూర్య కథ చెప్పారు చందు మోండేటి. పరశురామ్ కార్తీకి కథ వినిపించారు.