AmbajipetaMarriageBandReview:
సినిమా: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు (AmbajipetaMarriageBandReview)
ప్రధానతారాగణం: సుహాస్, శరణ్య, శివానీ నాగారం, నితిన్, జగదీష్, గోపరాజు రమణ
దర్శకుడు: దుష్యంత్ కటికనేని
సమర్పణ: బన్నీవాసు, వెంకటేష్ మహా
నిర్మాత: ధీరజ్ మోగిలినేని
సంగీతం: శేఖర్‌చంద్ర
విడుదల: ఫిబ్రవరి 02, 2024
కథ
చిరతపూడి గ్రామంలో కవల అక్కాతమ్ముళ్లు పద్మావతి (శరణ్యప్రదీప్ Sharanya Pradeep), మల్లికార్జున (సుహాస్ Suhas). ఆత్మాభిమానం గల పద్మావతి అదే ఊర్లో టీచర్‌గా పని చేస్తుంది. అంబాజీపేటమ్యారేజి బ్యాండు ట్రూప్ మెంబర్ మల్లికార్జున. అదే గ్రామంలో వడ్డీవ్యాపారి, కులం..పరువును ఓ ఆస్తిగా భావించే వెంకట్‌బాబు (మలయాళ నటుడు నితిన్). వెంకట్ చెల్లి వరలక్ష్మీ(శివానీ నాగరం), తమ్ముడు శీను. మల్లికార్జున తండ్రి కనకయ్య. వెంకట్‌బాబు దగ్గర కనకయ్య అప్పు చేస్తాడు. అప్పు తీర్చడంలో భాగంగా టీచర్‌గా పనిచేస్తున్న పద్మావతిని, పార్ట్‌టైమ్‌గా తన దగ్గర గుమస్తాగా పంపమని కనకయ్యను కోరతాడు వెంకట్‌బాబు. దీంతో వెంకట్‌బాబు, పద్మావతికి అక్రమసంబంధం ఉన్న ట్లుగా ఊర్లో పుకార్లు రేగుతాయి. మరోవైపు మల్లికార్జున, వరలక్ష్మీ ప్రేమించు కుంటారు. తమ కంటే తక్కువ కులంవాడైన మల్లికార్జున్ తన చెల్లి వరలక్ష్మీని ప్రేమించడాన్ని, తమ్ముడు శీనుని పద్మావతి చెంపదెబ్బ కొట్టడాన్ని ఏ మాత్రం సహించలేకపోతాడు వెంకట్. దీంతో పద్మావతిని దారుణంగా అవమానిస్తాడు. అక్కకు జరిగిన అవమానానికి వెంకట్బాబుపై తిరగబడటానికి వెళ్లి, మల్లికార్జున కూడా అవమానపడతాడు. వెంకట్‌బాబు చేతిలో అవమానానికి గురైన అక్కాతమ్ముళ్లు పద్మావతి, మల్లికార్జున ఏ విధంగా అతని పరువు తీయాలనుకుంటారు? వీరి ప్లాన్స్‌కు వెంకట్‌బాబు వేసి మరో ప్లాన్ ఏంటి? మల్లికార్జున, వరలక్ష్మీల ప్రేమకథ ఏమౌతుంది? పద్మావతి ప్రేమకథ ఎలా ముగుస్తుంది? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ
అగ్రవర్ణ కులం..నిమ్నకులం…వీరి రెండింటి మధ్య తారతమ్యాలు, అణచివేత, తిరుగుబాటు అంశాలను కథవస్తువుగా చేసుకుని ఎప్పట్నుంచో సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలుగులో ‘నారప్ప’, ‘మార్టిన్ లూధర్‌కింగ్, దసరా, పెదకాపు’ వంటి సినిమాలొచ్చాయి. ఈ కోవలోని చిత్రమే ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా కూడా. అయితే ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ దర్శకుడు దుష్యంత్ కులాల మధ్య తారతమ్యాలు, అణచివేతలకు అత్మాభిమానం అద్దే ప్రయత్నం చేశారు. మల్లి, లక్ష్మీల ప్రేమకథ ఫస్టాప్‌లో మేజర్ పార్ట్. మల్లి, పద్మావతిల యాక్షన్, ఎమోషన్ సెకండాఫ్‌లో కీలకం. ప్రేమకథ, ఎమోషన్ రెండూ రోటీన్‌గానే అనిపిస్తాయి. కానీ తొలిపార్టులో మల్లి, అతని స్నేహితుడు సంజీవ్(పుష్ప సినిమాలో చేసిన జగదీష్) మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త నవ్వు తెప్పిస్తాయి. ఇంట్రవెల్, క్లైమాక్స్ మెప్పిస్తాయి. మహిళల ఆత్మగౌరవం, ఆత్మాభిమానంను దర్శకుడు హైలైట్ చేయాలనుకున్నాడు. పద్మావతి, వెంకట్‌బాబు భార్య పాత్రలు ఈ కోవలోనే కనిపిస్తాయి. కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా పేలవంగా ఉంటుంది. కథలో పెద్ద స్కోప్ కూడా లేదు. సెకండాఫ్ టేకింగ్ బాగానే ఉన్నా, మళ్ళీ రోటిన్ ఎమోషన్ ట్రాక్‌లోకి కథ వెళ్లడం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆడియన్స్‌కు నచ్చేలా ఉంటాయి. సినిమా నిడివి కూడా తక్కువగా ఉండటం ఓ ఫ్లస్‌పాయింట్. ఫస్టాఫ్‌లో చాలా చలాకీగా ఉన్న హీరో పాత్ర, సడన్‌గా సీరియస్ మోడ్‌లోకి వెళ్లి ఓ సైడ్ క్యారెక్టర్ అయిపోవడం కాస్త మైనస్. అయితే సెకండాఫ్‌లో పోలీస్‌స్టేషన్‌లో వచ్చే ఓ సీన్ మాత్రం ఆడియన్స్‌కు హైప్ ఇస్తుంది. ఇలాంటి సీన్స్ మరో రెండు పడి ఉండాల్సింది. ‘ఆడదాని వెంట తిరిగి చూపించే మగతనాన్ని, ఆడదాన్ని వెనక నిలబడి చూపించండి, ‘ఆధారంలేని అక్రమ సంబంధం, అవమానపడ్డ ఆత్మాభిమానం’ అన్న డైలాగ్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతాయి ఈ సీన్స్‌ని బట్టి. ఆత్మాభి మానాన్ని, కులవ్యవస్థకు ముడిపెట్టడంతో దర్శకుడు కాస్త తడబడ్డాడు. కానీ తొలి ప్రయత్నంలోనే నిలబడ్డాడు దుష్యంత్.
పెర్ఫార్మెన్స్
రెండు వేరియేషన్స్ ఉన్న మల్లికార్జున్ పాత్రలో సుహాస్ బాగా నటించాడు. ముఖ్యంగా ప్రీ ఇంట్రవెల్ సీన్స్‌లో సుహాస్ యాక్టింగ్ ఎలివేట్ అవుతుంది. సెకండాఫ్‌లో మాత్రం ఓ సైడ్ క్యారెక్టర్ అవుతుంది. సుహాస్‌కు పోటాపోటిగా ఉన్న పాత్రలో శరణ్య అదరగొట్టారు. యాక్షన్, ఎమోషన్, బాధ…ఇలాంటి అన్ని అంశాల్లో శరణ్య ఏక్లాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని సీన్స్‌లో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించారు. సంజీవ్‌గా జగదీష్‌కు మంచి స్ట్రాంగ్ రోల్ పడింది. మెచ్చుకోదగ్గ యాక్టింగ్ కనబరచాడు జగదీష్. హీరోయిన్గా శివానీనాగరంకు స్క్రీన్ ప్రెజెన్స్ తప్పితే, యాక్టింగ్‌కు పెద్ద స్కోప్ లేదు. ఇక వెంకట్బాబుగా మలయాళ నటుడు నితిన్‌ది బలమైన పాత్ర. వెంకట్‌బాబు పాత్రలో నితిన్ బాగా చేశాడు. సెకండాఫ్‌లో మంచి విలనిజం చూపించాడు. కానీ ఇదే పాత్ర క్లైమాక్స్‌లో తేలిపోవడం అంతగా నప్పదు. గోపరాజు రమణ, శీనుబాబు పాత్రలో వినయ్ మహాదేవ్ పాత్రలు ఒకే. దర్శకుడిగా తొలిసినిమా అయిన దుష్యంత్ తన ప్రతిభ చూపాడు. కథలో ఇంకాస్త డ్రామా క్రియేట్ చేసి ఉంటే బాగుండేది. లవ్‌స్టోరీకి, ఎమోషన్‌కు రోటీన్ టెంప్లెంట్ వాడటం ఆడియన్స్‌కు నచ్చేలా ఉండదు. శేఖర్‌చంద్ర మ్యూజిక్, ఆర్ఆర్ ఒకే. కానీ సినిమాకు మైలేజ్‌ని ఇవ్వలేదు. కోడాటి పవన్‌కళ్యాణ్ ఎడిటింగ్ బాగుంది. వాజిద్ సినిమాటోగ్రఫీ ఒకే. సుహాస్ మార్కెట్‌కు తగ్గట్లు నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
సుహాస్, శరణ్యల యాక్టింగ్
ఇంట్రవెల్ సన్నివేశాలు
బలహీనతలు
బోరింగ్ లవ్‌ట్రాక్
రోటిన్ ఎమోషన్
ఫైనల్: రోటీన్ సౌండ్ (2.50)