సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. ఇప్పటికే పదికిపైగా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఎంపికైన జై భీమ్ మరో ఘనతను సాధించింది. 94వ ఆస్కార్ అవార్డుకు సంబంధించి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కోసం పరిశీలించే సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది. మొత్తం 276 సినిమాలను ఆస్కార్ అకాడమీ పరిశీలన చేయనుంది. ఇక ఇదే జాబితాలో మలయాళ చిత్రం మరక్కర్: అరబికడలింటే సింహామ్
చిత్రానికి కూడా చోటు దక్కింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోహన్‌లాల్ హీరోగా నటించారు. ఇక ఇదే సినిమాకు 67వ జాతీయ అవార్డుల్లో మూడు అవార్డులు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ ఈ ఏడాది ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తారు. మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది.
టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన జైభీమ్ ఆస్కార్ యూట్యూబ్ చానెల్లో స్ట్రీమ్ అవుతున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సాధించింది. ఇప్పుడు ఫీచర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అర్హత సాధిస్తుందా? లేదా? అనేది చూడాలి. అయితే ఇప్పటివరకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోనే అస్కార్కు నామినేట్ అయిన భారతీయచిత్రాలు చాలాకాలం తర్వాత డైరెక్ట్‌గా ఆస్కార్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ (ఓటీటీ చిత్రాలను కూడా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి) విభాగంలో చోటు దక్కించుకోవడం అనేది విశేషమే. మరోవైపు ఆస్కారులోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం నుంచి నామినేట్ అయిన తమిళం చిత్రం కూళంగల్కు నిరాశే ఎదురైన సంగతి గుర్తుండే ఉంటుంది.