Surya Kanguva: ఈ ఏడాది విడుదల కాబోతున్న చిత్రాల్లో తమిళ చిత్రం ‘కంగువా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘కంగువా’ టీజర్ ఈ అంచనాలను మరింత పెంచింది. కానీ అసలు..‘కంగువా’ సినిమా ఓ దశలో ఆగిపోయిందన్న విషయం తెలుసా..? అవును..‘కంగువా’ సినిమా ఓ దశలో క్యాన్సిల్ అయ్యింది. ఈ బ్యాక్ స్టోరీపై ఓ లుక్ వేయండి.
39వ సినిమా 42గా మారింది
హీరో సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్లో ఓ సినిమాను ప్రకటించారు. అప్పటికీ సూర్య కెరీర్లో 39వ సినిమా ఇది. కానీ ఇదే సమయంలో రజనీకాంత్‌తో ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) సినిమా చేసే అవకాశం వచ్చింది శివకు. దీంతో సూర్యతో చేయాల్సిన సినిమాను కాకుండా..ముందుగా రజనీకాంత్‌తో సినిమాను స్టార్ట్ చేశారు దర్శకుడు శివ. ఈ లోపు సూర్య ‘ఈటీ’ సినిమాను పూర్తి చేశారు. ఆ నెక్ట్స్ దర్శకుడు బాలతో ‘వనగామున్’ (తెలుగులో ‘అచలుడు’)ను స్టార్ట్ చేశారు సూర్య. కొంతకాలం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆగిపోయింది. ఇదే సమయంలో వెట్రిమారన్‌తో ‘వాడివాసల్’ సినిమాను ప్రకటించారు సూర్య. కానీ ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా చేయాల్సి ఉంది. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ దశలో దర్శకుడు శివకు కబురుపెట్టారు సూర్య. అలా ‘కంగువా’ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అయితే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాల్సి రావడంతో జ్ఞానవేల్ రాజా కాస్త ఆలోచించారు. ఇక్కడే యూవీ క్రియేషన్స్ సూర్యకు తోడైంది. దీంతో ‘కంగువా’ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది.
పదమూడు గెటప్స్‌లో సూర్య!
సూర్య ‘అయాన్’ సినిమా గుర్తుందిగా. అదేనండీ.తెలుగులో ‘వీడొక్కడే’గా వచ్చిన హిట్ ఫిల్మ్. ఈ సిని మాలో సూర్య దాదాపు పది గెటప్స్‌లో కనిపిస్తారు. అయితే ‘కంగువా’ సినిమాలో సూర్య పదమూడు గెటప్స్‌లో కనిపిస్తారట. ఈ సినిమా కథ రెండు టైమ్ పీరియడ్స్‌లో జరుగుతుంది. వెయ్యిసంవత్సరాల క్రితం జరిగిన కథగా, ప్రజెంట్ టైమ్‌లో జరిగిన కథగా ‘కంగువా’ ఉంటుంది. ప్రస్తుత సమయంలో వచ్చే అన్ని సన్నివేశాలను గోవాలో తీశారు. వెయ్యి సంవత్సరాల క్రితం అంటూ సినిమాలో వచ్చే సన్నివేశాలను శ్రీలంకలో తీశారట. ఇందుకోసం కొంత సెట్ వర్క్ కూడా జరిగింది. టీజర్లో మీరు చూసిన సన్నివేశాలు ఈ సెట్స్‌లో తీసినవే అట. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ, హీరో బాబీ డియోల్ తమిళ చిత్రపరిశ్రమకుల పరిచయం అవుతున్నారు.
కథ ఏంటో..?
‘కంగువా’ కథకు సైంటిఫిక్ టచ్ ఉంటుందట. వెయ్యి సంవత్సరాల క్రితం వీరుడైన ఓ వ్యక్తి అంతుచిక్కని ఓ వ్యాధితో చనిపోతాడు. అదే వ్యాధి 2023లో ప్రబలి నప్పుడు, అప్పుడు చనిపోయిన ఆ వీరుడు, ఇప్పుడు ఎలా సక్సెస్ అవుతాడు? అన్నదే కథ అట. సింపుల్‌గా చెప్పాలంటే కాస్త సూర్య చేసిన ‘సెవెన్త్ సెన్స్’ సినిమా స్టైల్ అన్నమాట. కానీ ‘కంగువా’ సినిమా కథ వేరు. ‘కంగువా’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనుకుంటున్నారు. తొలిభాగం తమిళ కొత్త సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్
‘సూరారైపోట్రు’(తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా..!’) సినిమా తర్వాత హీరో సూర్య, దర్శకుడు సుధా కొంగర ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మ్యూజిక్ వర్క్స్ మొదలైయ్యాయి. జీవీ ప్రకాష్ కుమార్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇది 100వ సినిమా. అలాగే వెట్రిమారన్ ప్రస్తుతం ‘విడుదలై’ సినిమా సెకండ్ పార్టుతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తి కాగానే…సూర్యతో ‘వాడివాసల్’ను స్టార్ట్ చేసే చాన్సెస్ ఉన్నాయి.