వేటగాడిగా మారారు రజనీకాంత్. ఆయన హీరోగా నటిస్తున్న 170వ సినిమాకు ‘వేట్టయాన్’ అనే టైటిల్ ఖరారైంది. ‘వేట్టయాన్’ అంటే ‘వేటగాడు’ అని అర్థం. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 33 ఏళ్ల తర్వాత అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటిస్తున్నారు రజనీకాంత్. రానా, ఫాహద్‌ఫాజిల్, దుషారావిజయన్, రీతూ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 సమ్మర్లో విడుదల కానుంది. భూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రజనీకాంత్ రిటైర్డ్ ముస్లిం పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీ కరణ ముంబైలో జరుగుతోంది. ఇక డిసెంబరు 12న రజనీకాంత్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘వేట్టయాన్’, ‘లాల్‌సలామ్’ సినిమాల అప్డేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే ‘లాల్‌సలామ్’ గ్లింమ్స్ వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. విష్ణు విశాల్, విక్రాంత్‌లు హీరోలుగా రజనీకాంత్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా నటించారు రజనీకాంత్. ఆయన కుమార్తె ఐశ్వర్యారజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది.
ఇక తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న నూతన చిత్రంలో కూడా రజనీకాంత్ హీరోగా ఓ సినిమా చేయాల్సిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఏప్రిల్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది.