బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’కు ఆస్కార్ నామినేషన్ దక్కగానే రాజమౌళి ట్విటర్‌లో ఓ నోట్‌ను షేర్ చేశారు. అందులో చిత్ర నిర్మాత అయిన డీవీవీ దానయ్య పేరు లేదు. అంతే..సుమారు 450 కోట్లు పెట్టి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను హీరోలుగా పెట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి సినిమా ను తీసిన దానయ్య పేరును రాజమౌళి గౌరవప్రదంగానైనా మెన్షన్ చేయకపోవడంతో సోషల్‌మీడియాలో విమర్శలు వెలువెత్తాయి.
కానీ ఈ విషయంపై ఇటు రాజమౌళి కానీ, అటు దానయ్యకానీ ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 95వ ఆస్కార్ ప్రధానోత్సవంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’కు అవార్డు దక్కింది. కానీ ఈ సమయంలో కూడా రాజమౌళి కానీ, అవార్డు గ్రహీతలైన ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్‌లు, ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాటు నాటు పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్‌లు ఎక్కడా కూడ నిర్మాత దానయ్య పేరును ప్రస్తావించిన దాఖలాలు లేవు.
ఆస్కార్ అంతటి ప్రతిష్టాత్మకం అవార్డు రాగానే మీడియా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ అందర్నీ పలకరించింది. ఈ ప్రక్రియలో భాగంగానే డీవీవీదానయ్యను కూడా మాట్లాడించింది మీడియా. ఈ సమయంలో దానయ్య నోరు విప్పకతప్పలేదు. రాజమౌళికి, తనకూ ఏ మాత్రం గొడవలు లేవని, 2006లో తాను ఇచ్చిన ఓ చిన్న అడ్వాన్స్ కోసం మాట తప్పకుండ రాజమౌళి తనతో సినిమా చేశారని రాజమౌళిని పొగుడుతూ వచ్చారు నిర్మాత దానయ్య.
అయితే ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు 95వ ఆస్కార్ అవార్డ్స్‌లోని ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడేందుకు గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ను పంపారు. దీంతో అధికారికంగా ఆస్కార్‌కు ఇండియా తరఫున ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎంపికకాకపోవడం పట్ల రాజమౌళి తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. ఎలాగైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ఆస్కార్ బరిలో నిలపాలని రంగంలోకి దిగాడు. కానీ ఇందుకు దాదాపు 50 కోట్ల రూపాయల వరకూ ఖర్చు అయ్యింది. అయితే ఈ ఖర్చులో దానయ్య సహకారంకానీ, ప్రోత్సాహం కానీ ఏం లేదు. ఈ విషయాన్ని దానయ్య కూడా ఒప్పుకున్నారు. ఇది కాస్త ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ సభ్యులకు నచ్చన్నట్లుంది. దీంతో దానయ్యను కాస్త దూరం పెట్టారు. దానయ్య కూడా దూరం జరిగారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌లో కాకుండా బెస్ట్ పిక్చర్‌కు ఆర్‌ఆర్‌ఆర్ నామినేట్ అయ్యి ఉంటే దానయ్య కూడా ఆస్కార్ రంగంలోకి దిగేవారు. ఎందుకంటే అవార్డు వస్తే నిర్మాతకు ఆస్కార్ ప్రతిమను ప్రదానం చేస్తారు కాబట్టి. కానీ ఇది ఎలాగూ జరగని పని. బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఇంటర్‌నేషన్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్ దక్కకపోయినందుకు రాజమౌళి కూడా బాధపడి ఉంటారు. కానీ తాను నెక్ట్స్ మహేశ్‌బాబుతో చేయబోయే సినిమాకు మాత్రం ఇంటర్‌నేషనల్ లెవల్లో ఓ గుర్తుంపు మాత్రం ఉంటుందని ఊహించవచ్చు.