MaheshBabu: మహేశ్‌బాబు, రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 1000కోట్ల రూపాయల బడ్జెట్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ భారీ బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి ఈ చిత్రం నిర్మాత కేఎల్ నారాయణతో పాటుగా, మరో నిర్మాత ఎవరైనా ఈ సినిమా భాగస్వామ్యులు అవుతారనే టాక్ మొదట్నుంచి వినిపిస్తోంది. ‘దిల్’ రాజుతో పాటుగా, కొన్ని విదేశీ నిర్మాణసంస్థల పేర్లకూడ ప్రస్తా వనకు వచ్చాయి. కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే…ఈ సినిమాకు మహేశ్బాబుయే (MaheshBabu) ఓ నిర్మాతగా ఉంటారట.
మహేశ్‌బాబు నిర్మాణసంస్థ జీఎమ్బీ (ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్స్ సంస్థ). మహేశ్‌బాబు గతంలో హీరోగా చేసిన ‘శ్రీమంతుడు’, ‘బ్రహోత్సవం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారువారి పాట’ వంటి సినిమా నిర్మాణంలో జీఎమ్బీ భాగస్వామిగానే ఉంది. ఇప్పుడు రాజమౌళితో సినిమాకు చెందిన నిర్మాణంలోనూ మహేశ్‌బాబు ఓ నిర్మాతగా ఉండాలని ఫిక్స్ అయ్యారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అయితే..మహేశ్‌బాబు నేరుగా పెట్టుబడులు పెట్టరట. బదులుగా సినిమా చిత్రీకరణ పూర్తయ్యేంతవరకూ పైసా కూడా తీసుకోరట. అంటే మహేశ్‌బాబు పారితోషికం తీసుకోండానే ఈ సినిమాకు వర్క్ చేస్తారట. అయితే బదులుగా సినిమా లాభాలు, నాన్–థియేట్రికల్, ఓటీటీ రైట్స్..వంటి వాటిని మహేశ్ తీసుకునే చాన్సెస్ ఉన్నాయట.
సినిమా ప్రారంభంలోనే భారీ అడ్వాన్స్‌లు అంటే నిర్మాతకు బరువు, ఒత్తిడిగా ఉంటుందని అందుకే మహేశ్ ఇలా చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది మరి. అయితే ఈ విషయంపై «అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ ఏడాది ఉగాదికి జరుగుతుందట. 2026 ఉగాదికి సినిమాను విడుదల చేస్తారట.