హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి. తొలిసారి వీరి కలయికలో వచ్చిన ‘జులాయి’, ఈ సినిమా తర్వాత వీరు కలిసి చేసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల..వైకుంఠపురములో..’ సినిమాలు కూడా హిట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా ‘అల..వైకుంఠపురములో..’ సినిమా మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో అప్పట్నుంచే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా ఉండొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. వీటిని నిజంచేస్తూ వీరి కాంబినేషన్లోని నాలుగో సినిమా అనౌన్స్మెంట్ గురుపూర్ణిమ 2023 సందర్భంగా వెల్లడైంది. గీతాఆర్ట్స్, హారిక అండ్ హాసినిల పతాకాలపై అల్లు రామలింగయ్య, మమతల సమర్పణలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు ఈ సినిమాను నిర్మించనున్నారు.
సుకుమార్‌తో అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప 2’,మహేశ్‌తో త్రివిక్రమ్ చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా చిత్రీకరణలు పూర్తయితే త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. ఇకఅల్లుఅర్జున్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు చాలా సమయం పట్టేలా ఉన్నట్లు తెలుస్తోంది.