MileStone Movies: ఏ హీరో కెరీర్లో అయిన మైల్స్టోన్ మూవీస్ అంటే జ్ఞాపకాలుగా ఉంటాయి. ఇందుకోసం ఆయా హీరోలు కథలు, సినిమాల విషయంలో కాస్త కేర్ తీసుకుంటు ఉంటారు. పైకి నెంబర్స్ గురించి ఆలోచించమని చెప్పినా, ఆ జాగ్రత్తలు మాత్రం ఉంటాయి. లేకపోతే హీరో 75వ సినిమా, 25వ సినిమా అంటూ ఆ సినిమాల పోస్టర్స్‌పై స్టాంపులు ఎందుకు ఉంటాయి. అయితే కొందరి హీరోల కెరీర్ మైల్స్టోన్ మూవీస్ మటాష్ అయిపోయాయి. అందేనండీ…సినిమాలు ప్లాఫ్ అయ్యాయి. ఆ హీరోలు, వారి సినిమాలు ఏవో ఓ లుక్ వేయండి.
వెంకటేష్ సైంధవ్
విక్టరీ వెంకటేష్‌గా ఇండస్ట్రీలో వెంకీకి స్పెషల్ ఇమేజ్ ఉంది. నిజమైన ఫ్యామిలీస్టార్గా ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది. కానీ వెంకీ అప్పుడప్పుడు ‘గణేష్’, ‘థర్మచక్రం’, ‘బొబ్బిలిరాజా’ వంటి యాక్షన్ సినిమాలను కూడా చేశారు. ఇలా వెంకీ చేసిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘సైంధవ్’. వెంకీ కెరీర్లో 75వ సినిమా రూపొందిన ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదలై, డిజాస్టర్‌గా నిలిచింది. ‘హిట్’, ‘హిట్ 2’ వంటి సినిమాలను తీసిన శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. ‘శ్యామ్‌సింగరాయ్’ని నిర్మించిన వెంకట్ బోయనపల్లియే ఈ సైంధవ్ సినిమాను నిర్మించారు.
పవన్‌కళ్యాణ్ అజ్ఞాతవాసి
‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాలు హీరో పవన్‌కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన థర్డ్ ఫిల్మ్ ‘అజ్ఞాతవాసి’. పవన్‌కళ్యాణ్ కెరీర్లో ఈ సినిమా 25వది. 2018 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.
నాని వి
నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాని నటించిన ఓ చిత్రం ‘వి’. ‘అష్టాచమ్మా’తో నాని హీరోగా పరిచయం చేసి, ఆ తర్వాత నానిని ‘జెంటిల్మెన్’ సినిమాలో కాస్త నెగటివ్‌గా చూపించిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సిని మాకు దర్శకుడు. ‘వి’ సినిమాలో హీరో సుధీర్‌బాబు కూడ ఓ రోల్ చేశారు. అయితే కరోనా సమయం కావడంతో ‘వి’ సినిమా అప్పట్లో డైరెక్ట్‌గా అమెజాన్ ఓటీటీలో విడుదలైంది. హిట్ మూవీ కాలేకపోయింది. 2020లో వ్యూయర్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు నిర్మాత.
నితిన్ ఛల్ మోహనరంగ
నితిన్ కెరీర్లో రూపొందిన 25వ సినిమా ‘ఛల్ మోహనరంగ’. ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకుడు. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. 2018లో సుధాకర్‌రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్‌కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు.
కార్తీ జపాన్
కార్తీ హీరోగా నటించిన 25వ సినిమా ‘జపాన్’. ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌బాబు ఈ సినిమాను నిర్మించారు. రాజు మురుగన్ దర్శకుడు. ఎన్నో అంచనాల మధ్య 2023లో విడుదలైన ఈ సినిమా కార్తీ కెరీర్లోనే డిజాస్టర్‌గా నిలిచింది.
కెరీర్లో మైల్స్టోన్ హిట్స్కొట్టిన హీరోలు ఉన్నారు
సూర్య 25వ సినిమా ‘సింగమ్’ బ్లాక్‌బస్టర్. ఎన్టీఆర్ ‘నాన్నకుప్రేమతో..’ సూపర్‌హిట్. చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబరు 150’, బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్రశాతకర్ణి’ సినిమాలు సూపర్‌హిట్ మూవీస్. ఇలా మరికొన్ని ఉన్నాయి.