NTR30: ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ NTR 30. గురువారం (మార్చి 23) ఈ సినిమా గ్రాండ్ లెవల్లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ 30 లాంచింగ్ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్స్ ఎస్.ఎస్.రాజమౌళితో పాటు ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంకా ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, ఏషియన్ సునీల్, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, భరత్ చౌదరి, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ కొట్టగా, కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రశాంత్ నీల్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సందర్భంగా..
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘ఎన్టీఆర్‌గారితో సెకండ్ టైమ్ సినిమా చేస్తున్నాను. జనతాగ్యారేజ్ తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం రావడం చాలా లక్కీ. ఈ జెనరేషన్ బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్. నా బ్రదర్ ఆయన. సినిమా ఐడియా ఫార్ అక్రాస్ కోస్టల్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియా, ఫర్‌గాటెన్ ల్యాండ్స్ లో సెట్ అయిన కథ ఇది. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాలుంటారు. దేవుడంటే భయం లేదు. చావంటే భయం లేదు. కానీ, ఒకే ఒకటంటే భయం వారికి. ఆ భయమేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ఈ సినిమాలో నా ప్రధాన పాత్ర ఏ రేంజ్‌కి వెళ్తుందనేది ఎమోషనల్ రైడ్. చాలా బిగ్ మూవీ అవుతుంది. ఈ సినిమా నా బెస్ట్ అవుతుందని అందరికీ ప్రామిస్ చేస్తున్నా. ఇంత పెద్ద ఐడియాను తీసుకెళ్లడానికి నాకు గ్రేట్ ఆర్మీ కావాలి. ఇంత మంది గొప్ప టెక్నీషియన్లు నాతో పనిచేశారు. ఈ కథకు ప్రాణం పోయాలంటే నేనెంత రాయాలో, అనిరుద్ అంత చేయాలి. ఫైర్‌తో రాశారు సార్ ఈ కథని అని అనిరుద్ అన్నారు. లెజెండరీ శ్రీకర్‌ప్రసాద్‌గారు స్క్రిప్టింగ్ టైమ్ నుంచే నాతో ఉన్నారు. రత్నవేలు సార్, సినిమా స్టార్ట్ కావడానికి ముందే నాతో ఏడాదిగా ట్రావెల్ అవుతున్నారు. సాబు సార్ తప్ప, నా ఊహకి రూపం ఇవ్వడానికి ఇంకెవరూ లేరు. నా ఫ్రెండ్ యుగంధర్ నాతో పనిచేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ కి పనిచేస్తున్నారు. జాన్వీ హీరోయిన్‌గా చేస్తున్నారు. సెట్స్ లో ఫన్ ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మాట్లాడుతూ – ‘‘శివగారిని ఏడాది క్రితం కలిశాను. అప్పటి నుంచి వండర్‌ఫుల్ టైమ్ స్పెండ్ చేస్తున్నాం. ఆయన విజన్‌లో నేను చిన్న భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. హ్యూజ్ విజన్ ఆయనది. ఈ సినిమాలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. లెజండరీస్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మోషన్ పోస్టర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా బావుంది. తారక్‌కి ధన్యవాదాలు. నేను తిరిగి వస్తున్నా’’ అన్నారు.
ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఎమోషనల్ స్టోరీని శివగారు ఎలా ముందుకు తీసుకెళ్తారో నాకు తెలుసు. శివగారి విజన్‌ని మేం అందరం ముందుకు తీసుకెళ్తామని భావిస్తున్నాను’’ అన్నారు.
సినిమాటోగ్రపీ రత్నవేలు మాట్లాడుతూ- ‘‘ఇంత మంది లెజండరీస్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. టెక్నికల్‌గా చాలెంజింగ్ సినిమా. సీ బ్యాక్‌గ్రౌండ్‌లో చేస్తున్నాం. ల్యాండ్‌లో రెండు షాట్స్ చేసేది, సముద్రంలో చేయడానికి అరపూట పడుతుంది. టెక్నికల్‌గా బ్రిలియంట్ సినిమా అవుతుంది. శివగారి విజన్‌ని స్క్రీన్ మీదకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం’’ అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ మాట్లాడుతూ- ‘‘నాకు గ్రేట్ చాలెంజ్ ఇచ్చారు. టెక్నీషియన్లు అందరం ఒకరికొకరు సహకరించుకుంటాం. నాకు చాలెంజ్‌లంటే ఇష్టం. ఏడాది గా ఈ సినిమాకు పనిచేస్తున్నాం’’ అన్నారు.
వి.ఎఫ్.ఎక్స్ యుగంధర్ మాట్లాడుతూ- ‘‘అందరికీ నమస్కారం. నేను 25 ఏళ్లుగా విజువల్ ఎఫెక్స్ట్ చేశాం. విజువల్ ఎఫెక్స్ట్ నేను చేసిన వాటిలో ఎప్పుడూ శాటిస్‌పేక్షన్ రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంలోని బెస్ట్ స్టూడియోలను మేం లాక్ చేస్తున్నాం. నా మీద నమ్మకం ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను’’ అన్నారు.
NTR 30 చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయబోతున్నారు.