సంక్రాంతి పండక్కి నాగార్జున కెరీర్లో మంచి హిట్ ట్రాక్ ఉంది. నాగార్జున హీరోగా నటించి, సంక్రాంతికి విడుదలైన ‘మజ్ను’ (1987), ‘కిల్లర్’(1992), ‘ఆవిడా మా ఆవిడే’ (1998), ‘సోగ్గాడే చిన్ని నాయానా’ (2016), ‘బంగార్రాజు’(2022), వంటి సినిమాలకు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఈ కోవలో ఈ ఏడాది (2014) ‘నా సామిరంగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగార్జున. కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ముందు ఉండే నాగార్జున, కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని ఈ సినిమాతో దర్శకుడిగా పరి చయం చేశారు. మరి..కొత్త దర్శకుడితో నాగార్జున ‘నా సామిరంగ’ అంటూ తీసిన ఈ సినిమా విజయం సాధించిందా? రివ్యూలో చదవండి
సినిమా: నా సామిరంగ (Nagarjuna Naa Saami Ranga)
ప్రధాన తారాగణం: నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్‌తరుణ్, ఆషికా రంగనాథ్, మీర్నా మీనన్, రుహానీ శర్మ, షబ్బీర్, నాజర్
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
దర్శకుడు: విజయ్ బిన్నీ
సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి
కథ
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఊర్లో కిష్టయ్య(నాగార్జున), అంజి (‘అల్లరి’ నరేశ్) సోదరభావంతో ఒకే ఇంట్లో కలిసి ఉండే ప్రాణ స్నేహితులు. ఆ ఊరి పెద్దయ్య (నాజర్)కు కిష్టయ్య నమ్మిన బంటులా, కుడి భుజంగా ఉంటుంటాడు. ఊర్లో వడ్డీవ్యాపారి వరదరాజులు(రావు రమేష్) కుమార్తెను వరలక్ష్మీ(ఆషికా రంగనాథ్)ని చిన్నతనం నుంచే ప్రేమిస్తుంటాడు కిష్టయ్య. అలాగే అంజి, వరలక్ష్మీ మంచి స్నేహితులు. వరలక్ష్మీని పెద్దయ్య చిన్న కుమారుడు దాసు(షబ్బీర్)కు ఇచ్చి వివాహం చేసుకోవాలనుకుంటాడు వరద రాజులు. అలా పెద్దయ్య కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని వరదరాజులు మాట్లాడుతున్న సమయంలోనే కిష్టయ్య తన ప్రేమ విషయాన్ని వారందరి ముందు చెబుతాడు. వరదారాజులు కోపంతో వర లక్ష్మీని ఇంటికి తీసుకువెళ్తాడు. కిష్టయ్యను పెళ్లి చేసుకుంటే తాను చనిపోతానని వరలక్ష్మీని బెదరించే క్రమంలో చనిపోతాడు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక పోయిన వరలక్ష్మీని కిష్టయ్యకు దూరంగా ఉండాలనుకుంటుంది. దాసు మాత్రం ఎలాగైన వరలక్ష్మీని సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు. అలాగే తన తండ్రి పెద్దయ్య కిష్టయ్యను చేరదీయడం దాసుకు ఏ మాత్రం నచ్చదు. కిష్టయ్య, అంజిలపై శత్రుత్వం పెంచుకుంటాడు. మరి…కిష్టయ్య, వరలక్ష్మీ ఎలా కలుస్తారు? కిష్టయ్య, అంజిలపై ఏ విధంగా దాసు పగ తీర్చుకోవాలనుకుంటాడు? ఊరి కుర్రాడు భాస్కర్(రాజ్‌తరుణ్) ప్రేమకథ కిష్టయ్య, అంజిల జీవితాన్ని ఎలా మార్చింది? అన్నది సినిమాలో చూడాలి.
విశ్లేషణ
మలయాళ హిట్ ఫిల్మ్ ‘పొరింజు మరియమ్ జోస్’(2019)కు తెలుగు రీమేక్‌గా ‘నా సామిరంగ’ సినిమా తెరకెక్కింది. రెండు ప్రేమకథలు, రెండు ఊర్ల గొడవ, ఇద్దరు స్నేహితులు…సింపుల్‌గా ‘నా సామిరంగ’ స్టోరీ ఇది. 1963లో కిష్టయ్య, అంజిల చిన్ననాటి స్నేహాం బ్యాక్‌డ్రాప్‌తో కథ మొదలవుతుంది. 1988లో జరిగే భాస్కర్ లవ్‌స్టోరీ, 1978లో జరిగే కిష్టయ్య లవ్‌స్టోరీలతో సినిమాను ఇంట్రవెల్ వరకు తెచ్చేస్తాడు దర్శకుడు. ఈ లవ్స్టోరీల హ్యాపీ ఎండింగ్‌కు అంజి సెంటిమెంట్, కిష్టయ్య యాక్షన్లతో స్టోరీ ముగుస్తుంది. అంజి సాయంతో కిష్టయ్య, వరలక్ష్మీలు కలుసుకునే సన్నివేశాలు రోటీన్‌గా ఉంటాయి కానీ ప్రేక్షకులను విసిగించవు. సంక్రాంతి బ్యాక్‌డ్రాప్‌ను కరెక్ట్‌గా వాడుకున్నాడు దర్శకుడు. సెకండాఫ్‌లో ఇది బాగా వర్కౌట్ అయినట్లు అనిపిస్తుంటుంది.
ఒక చావుతో దూరమైన కిష్టయ్య, వరలక్ష్మీ…మరోకరి చావుతో దగ్గర కావడం అనే పాయింట్ బాగుంటుంది. ‘అల్లరి’ నరేశ్, నాగార్జున కాంబినేషన్లోని సన్నివేశాలు ప్రేక్షకులను అలరి స్తాయి. యాక్షన్ బ్లాక్స్ నాగార్జున ఎనర్జీతో బాగుంటాయి. కానీ క్లైమాక్స్‌లో ఈ యాక్షన్‌లో కాస్త అతి కనిపిస్తుంది. అన్ని కత్తిపోట్లు పొడిపించుకున్న హీరో బతకడం అనే కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు నచ్చేదే కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ ఫస్టాఫ్‌లో వరలక్ష్మీని పేరును రెండుసార్లు మహాలక్ష్మీ అని పలుకుతాడు ఆమె తండ్రి. ఇలాంటి చిన్న చిన్న మైనస్‌లు సినిమాకు పెద్ద సమస్య కాలేదు. ప్రధాన పాత్రల గోదావరి యాస అంత కరెక్ట్‌గా ఉండదు. సినిమాకు సంక్రాంతి నేపథ్యం ఉంచి, సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడం మరో ఫస్ల్ పాయింట్‌గా ఉంటుంది.
ఎవరు ఎలా చేశారంటే….
కిష్టయ్యగా నాగార్జున అదరగొట్టారు. యాక్షన్ సీన్స్‌లో ఎనర్జీ చూపించారు. అలాగే రొమాంటిక్ సీన్స్‌లో తన మార్క్ మరోసారి ప్రూవ్ చేశాడు. నాగార్జున పాత్ర ఎమోషనల్ కన్నా, యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అంజి పాత్రలో అల్లరి నరేశ్ హడావిడి చేశారు. అంతే అంజి పాత్ర ఎం డింగ్ అందరూ ఊహించినట్లే ఉంటుంది. ఎప్పటిలానే ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. భాస్కర్ పాత్రలో రాజ్‌తరుణ్ సెటిల్డ్‌గా చేశాడు. రెచ్చిపోవడానికి అతని పాత్రకు కథలో స్కోప్ లేదు. ఇక ఆషికా రంగనాథ్‌కు నాగార్జునతో సమానమైన రోల్ పడింది. ఆమె బాగా నటించింది. మాస్ డైలాగ్స్ ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. విలన్‌గా షబ్బీర్ మంచి ప్రదర్శన చేశాడు. ఓ డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించాడు. పెద్దయ్యగా నాజర్, అంజి భార్య మంగగా మీర్నా మీనన్, భాస్కర్ ప్రేయసిగా రుహానీ, వరదరాజులు పాత్రలో రావు రమేష్ ఒకే. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కీరవాణిగారి సంగీతం. ఈ సినిమాకు బాగా ఫ్లస్ అయ్యింది. పాటలు, ఆర్ఆర్ కుదిరాయి. ఎత్తుకెళ్లిపోవా లనిపిస్తుందే, దుమ్ముదుమారం, సీసా మూత, కిష్టయ్యది అంజిది…ఇలా పాటలు అన్నీ బాగున్నాయి. కాస్త ఎడిటింగ్ జరిగి ఉండొచ్చు. కెమెరా వర్క్ బాగానే ఉంది. బెజవాడ ప్రసన్నకుమార్ కథకుడిగా ప్రేక్షకులకు నచ్చే మంచి మార్పులే చేశారు.
ఫైనల్‌గా…సంక్రాంతికి నా సామిరంగ (2.75/5)