Chiranjeevi: కేంద్రప్రభుత్వం 2024సంవత్సరానికి గాను పద్మ అవార్డులను గురువారం ప్రకటించింది. ఇందులో మొత్తం 132 పద్మ అవార్డులను ప్రకటించారు. వీటిలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. 30 మంది మహిళలు ఉన్నారు. 9మంది విదేశీయులు. మరణానంతరం 8మందికి పద్మ పురస్కారాలను ప్రకటించారు. ఇక పద్మవిభూషణ్ విభాగంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), వైజయంతీమాల, వెంకయ్యనాయుడు వంటి వారు ఉన్నారు. ఇటీవల మరణించిన విజయకాంత్‌కు పద్మభూషణ్ ప్రకటించింది కేంద్రప్రభుత్వం. ఇక దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం దక్కడం పట్ల మెగాసార్ట్ చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక తెలుగులో అక్కినేని నాగేశ్వరరావుగారు తొలి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు చిరంజీవికి భారతదేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. దీంతో తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పద్మ విభూషణ్ అవార్డ్ అందుకోవడం పై
చిరంజీవి స్పందన @KChiruTweets #MegastarChiranjeevi #PadmaAwards2024 #PadmaAwards #tollywoodhub pic.twitter.com/idUuDDcmh7
— TollywoodHub (@tollywoodhub8) January 25, 2024
#MegastarChiranjeevi Celebrations#PadmaAwards2024 #PadmaVibhushanMegastarChiranjeeviGaru pic.twitter.com/rSqJm6PXBh
— TollywoodHub (@tollywoodhub8) January 25, 2024
స్టార్.. స్టార్.. మెగాస్టార్.. స్టార్.. స్టార్..
స్టార్.. స్టార్.. మెగాస్టార్.. స్టార్.. స్టార్.. సిల్వర్ స్క్రీన్ మీద ఆయన కనబడితే ఫ్యాన్స్, ఆడియెన్స్ విజిల్స్, క్లాప్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతాయ్.. ఆయన కాలు కదిపితే పూలు, పేపర్లతో తెర నిండిపోతుంది. మాస్‌గా డైలాగ్ చెప్పినా, తన స్టైల్ మేనరిజమ్స్ చూపించినా.. ప్రేక్షకులు ముచ్చట పడిపోతారు. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి.
జననం-విద్యాభ్యాసం
1955 ఆగస్టు 22న మెగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా కొణిదెల శివ శంకర వరప్రసాద్ జన్మించారు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడం వలన తరచూ ఉదో ఒక ప్రాంతానికి బదిలీ అవుతూ ఉండేది. చిరు తన బాల్యంలో కొంతకాలం తాతయ్య దర్గర ఉన్నారు. నిడుదలవోలు, బాపట్ల, గురజాల, పొన్నూరు, మంగళగిరి వంటి ఊళ్లలో ఆయన చదువుకున్నారు. ఒంగోలులోని సి.ఎస్.ఆర్. శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నరసాపురంలోని వై.ఎన్. కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుపుకున్నారు. 1970 లో ఎన్.సి.సి లో చేరి న్యూఢిల్లీలో జరిగిన పరేడ్‌లో పాల్గొన్నారు.
మద్రాస్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ
చిరుకి చిన్ననాటి నుండి నటన మీద ఆసక్తి ఉండేది. దీంతో ఎలాగైనా నటుడవ్వాలని ఫిక్స్ అయ్యారు. డిగ్రీ అనంతరం 1976 లో చెన్నై చేరుకున్నారు. అక్కడ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. అక్కడ నటనలో డిప్లోమా పొందిన తర్వాత నటుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు.
కెరీర్ స్టార్టింగ్‌లో విలన్ రోల్స్
‘తాయారమ్మ బంగారయ్య’ లో ఓ చిన్న వేషం వేసిన తర్వాత.. ‘ఐ లవ్ యు’ అనే మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘ఇది కథ కాదు’ లో విలన్‌గా కనిపించారు. ‘పున్నమినాగు’ లోనూ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించారు. ‘మోసగాడు’, ‘రాణీ కాసుల రంగమ్మ’, ‘47 రోజులు’, ‘న్యాయం కావాలి’ వంటి సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు వేశారు.
సుప్రీంహీరో
‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘సంఘర్షణ’, ‘గూండా’, ‘ఛాలెంజ్’, ‘హీరో’,‘ దొంగ’, ‘జ్వాల’, ‘అడవి దొంగ’, ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1985 లో చిరంజీవికి ‘విజేత’ సినిమాలో నటనకు రెండవసారి ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్నారు. 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చంటబ్బాయి’ సినిమాలో కామెడీ క్యారెక్టర్లో చిరు పండించిన హాస్యాన్ని అంత త్వరగా మర్చిపోలేం.
తెలుగులో తొలిబ్రేక్డ్యాన్సర్
ప్రముఖ దివంగత దర్శకులు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వయంకృషి’ సినిమాతో చిరంజీవి మొట్టమొదటి సారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ‘పసివాడి ప్రాణం’, ‘యముడికి మొగుడు’, ‘మంచిదొంగ’ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ‘పసివాడి ప్రాణం’ ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు బ్రేక్ డ్యాన్స్‌ను పరిచయం చేసిన ఘనత చిరుదే. సామాజిక అంశాలను గురించి తీసిన ‘రుద్రవీణ’ ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం అందుకుంది. ‘కొదమ సింహం’ సినిమా ఇంగ్లీష్‌లో ‘థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ పేరుతో డబ్ అయ్యి.. నార్త్ అమెరికా, మెక్సికో, ఇరాన్ వంటి దేశాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఇది ఇంగ్లీష్‌లో డబ్ అయిన మొట్టమొదటి దక్షిణ భారత చలనచిత్రం.
ట్రెండ్ సెట్టర్..
1990లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చినసోషియో ఫాంటసీ చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లో వరదల్లోనూ బాక్సాఫీస్ వద్దు కలెక్షన్ల వరద పారించిందీ చిత్రం. ‘కొండవీటి దొంగ’ 70mm, 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌లో విడుదలైన మొట్టమొదటి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది.
1991 లో వచ్చిన ‘కొదమ సింహం’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు చిరంజీవిని తెలుగు చిత్రపరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సాధించిపెట్టాయి. అయితే ఓ దశలో చిరం జీవిని వరుస ఫ్లాప్స్ చుట్టుముట్టాయి. బిగ్‌బాస్, రిక్షావోడు, ఎస్పీపరశురామ్ ఇలా వరుస పరజాయాలు చూశారు చిరంజీవి. అయితే 1997లో హిట్లర్ తో బ్లాక్‌బస్టర్ హిట్‌కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు మెగాస్టార్. ‘మాస్టర్’, ‘బావగారూ బాగున్నారా’, ‘చూడాలని వుంది’, ‘స్నేహం కోసం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి.
పెరిగిన పాపులారిటీ
టాలీవుడ్ నుండి చిరు బాలీవుడ్ వెళ్లి నటించిన ‘ప్రతిబంధ్’, ‘ఆజ్ కా గూండా రాజ్’ సినిమాలు అక్కడ ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 1996 లో ‘సిపాయి’ అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించారు చిరంజీవి. ‘ఆపద్బాంధవుడు’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రెండో సారి నంది పురస్కారం, ఫిలిం ఫేర్ తెలుగు అవార్డు అందుకున్నారు. చిరు నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’.. తమిళనాట ‘మాప్పిళై’ పేరుతో రీమేక్ అయింది. ఇందులో రజినీకాంత్ కథానాయకుడిగా నటించారు. చిరంజీవి అతిథి పాత్రలో కనిపించారు. చిరంజీవికి నాలుగోసారి ఫిల్మ్ ఫేర్ సాధించి పెట్టిన సినిమా ‘ముఠామేస్త్రి’.
2006లో పద్మభూషణ్
‘ఇంద్ర’ సినిమా అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంతో చిరంజీవికి ఉత్తమ నటుడిగా మూడోసారి నంది పురస్కారం, ఆరోసారి ఫిలిం ఫేర్ పురస్కారాలు అందాయి. ‘ఠాగూర్’ సినిమా చిరంజీవిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.’ లో తన స్టైల్ కామెడీతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఏడోసారి ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్నారు. ‘స్టాలిన్’ సొసైటీలో మార్పు తీసుకొచ్చిన చిత్రంగా గుర్తుండిపోతుంది. 2006 లో చిరంజీవికి సినీ రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం లభించింది. ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత చిరు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.
అయినా గ్యాంగ్‌లీడర్‌లో చేయిరఫ్ఫాండించిన, ఇంద్ర సినిమాలో వీణ డ్యాన్స్ చేసినా, ‘స్టాలిన్’, ‘ఠాగూర్’ సినిమాలో సందేశం ఇచ్చిన అది చిరంజీవికే చెల్లింది. అలాగే ఆస్కార్ వేడుకు తొలిసారి వెళ్లిన దక్షిణాది నటుడు కూడా చిరంజీవియే అన్న సంగతి తెలిసిందే.
రాజకీలయాలు టు రీ ఎంట్రీ
ప్రజల్లో చైతన్యం, రాజకీయాల్లో మార్పు తీసుకు రావాలని, తెలుగు ప్రజల కోరిక మేరకు ‘ప్రజారాజ్యం’ పార్టీ ఏర్పాటు చేసి.. రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించారు. పర్యాటక శాఖా మంత్రి గానూ సేవలందించారు. పాలిటిక్స్ కారణంగా దాదాపు పది సంవత్సరాలు తెలుగు వెండితెరకు దూరంగా ఉన్నారు మెగాస్టార్. చరణ్ ‘మగధీర’, ‘బ్రూస్ లీ’ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసి ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ను పలకరించారు. తన 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’తో రీ ఎంట్రీ ఇచ్చిన తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. ఆ తర్వాత ‘సైరా’, ‘గాడ్‌ఫాదర్’, ‘ఆచార్య’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళాశంకర్’ వంటి సినిమాలతో చిరంజీవి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ‘బింబిసార’తో హిట్ కొట్టిన వశిష్టతో సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.