తమిళ ప్రముఖ నటుడు– దర్శకుడు విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడి, చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన వారం రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. అయితే శ్వాస తీసుకోవడంలో విజయకాంత్ ఇబ్బందులకు లోనుకావడంతో, ఆయన్ను చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన కుటుంబసభ్యులు. కాగా గురువారం ఉదయం ఆయన మరణించినట్లుగా హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. విజయకాంత్ మరణానికి కారణమైన కారణాల్లో కోవిడ్ కూడా ఉందని తమిళ మీడియా చెబుతోంది.
తమిళనాడులోని మధురైలో 1952 ఆగస్టు15న జన్మించారు విజయకాంత్. అసలు పేరు..నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. 27 సంవత్సరాల వయసులో ‘ఇనిక్కుమ్ ఇలమై’ సినిమాతో నటుడిగా ప్రతి నాయకుడి పాత్రలో తొలిసారి వెండితెరపై కనిపించారు విజయకాంత్. కెరీర్ ఆరంభంలో ఆయన నటించిన కొన్ని సినిమాలు పరాజయం పాలైన, నటుడిగా నిలదొక్కుకున్నారు విజయకాంత్. ఆయన ఎంతో కష్టపడి సినిమాలు చేసేవారు. మూడు షిప్ట్స్‌లో పని చేసిన అతి కొద్దిమంది నటుల్లో విజయకాంత్ ఒకరు. ఓ దశలో రజనీకాంత్, కమల్‌హాసన్‌లతో పాటుగా తమిళ చిత్ర పరిశ్రమలో విజయకాంత్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. విజయకాంత్ నూరవ చిత్రం ‘కెప్టెన్ ప్రభాకర్’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ఆయన్ను అందరు కెప్టెన్ విజయకాంత్ అని పిలవడం ప్రారంభించారు. కెరీర్లో 150కిపైగా సినిమాల్లో నటించిన విజయకాంత్, ఎక్కువగా పోలీస్పాత్రల్లోనే కనిపించారు. విజయకాంత్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి. కొన్ని రీమేక్ అయ్యారు. ఇక విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ‘విరుధగరి’. 2001లో తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కళామామణి అవార్డుతో సత్కరించింది. మరోవైపు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు విజయకాంత్. 2005లో డీఎమ్‌డీకే పార్టీని స్థాపించిన ఆయన, 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో గెలు పొందారు. 2016లో ఓటమి చవిచూశారు. విజయకాంత్‌కు భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక విజయకాంత్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తమిళనాడు థియేటర్స్ ఎగ్జిబిషన్ సెక్టార్ వారు విజయకాంత్ మరణానికి సంతాపంగా తమిళనాడు వ్యాప్తంగా సినిమాల ప్రదర్శనను స్వచ్ఛందంగా నిలిపివేశారు.