Prabhas and prashanthnell Salaarceasefire: ప్రభాస్ ‘సలార్:సీజ్ఫైర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 400 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఇంకా విజయవంతంగా ప్రదర్శంచబడుతోంది. ఈ సినిమాకు తెలుగులో, హిందీలో ఎలాగూ మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఊహించారు. అలానే జరిగింది. తెలుగులో వందకోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను దాటేసిన ఈ చిత్రం, హిందీలో యాభైకోట్ల షేర్ వసూలు దిశగా దూసుకెళ్తోంది. తమిళం, మలయాళంలో ఫర్వాలేదు. కానీ కన్నడలో మాత్రం ‘సలార్’ సినిమాకు ఏ మాత్రం ఆదరణ దక్కడం లేదు. చెప్పాలంటే ‘సలార్ సీజ్ఫైర్’ సినిమాకు కన్నడ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్‌డే గ్రాస్ కలెక్షన్లక్షల్లో ఉంటే, నాలుగు రోజులకు గ్రాస్ 2 కోట్లు కూడా దాటలేదు. కన్నడంలో ‘కేజీఎఫ్’ తీసి, కన్నడ పరిశ్రమ ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించిన ప్రశాంత్‌నీల్ సినిమాలకు కన్నడ ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లేకపోవడం ఆశ్చర్యకరమే.ఇందుకు చాలాకారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
‘కేజీఎఫ్’ సూపర్‌హిట్ కావడంతో ఒక్కసారి యశ్, ప్రశాంత్నీల్ల పేర్లు మారుమోగిపోయాయి. ఆ దశలో ప్రశాంత్‌నీల్ మూలాను వెతికారు నెటిజన్లు. ఈ క్రమంలో తెలిసింది ఏంటంటే…ప్రశాంత్‌నీల్ తెలుగువాడు. తెలుగు మూలాలు ఉండి, కర్ణాటకలో నివాసం ఉండే ఫ్యామిలీలో జన్మించాడు ప్రశాంత్‌నీల్. ఇతని తాతగారి ఫ్యామిలీ తెలుగువారే.అనంతపురంలో ఉండేవారట. ఇలా ప్రశాంత్‌నీల్ తెలుగు దర్శకుడనే పేరు పడిపోయింది. ఆ వెంటనే ప్రశాంత్‌నీల్ తెలుగు హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్‌లతో సినిమాలు కమిటైయ్యాడు. ‘కేజీఎఫ్’లాంటిహిట్ తర్వాత మరో కన్నడ హీరోతో సినిమా తీయకుండ, తెలుగువారితో సినిమా చేయడం కన్నడీగులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ప్రశాంత్‌నీల్ తెలుగు పరిశ్రమ పక్షపాతి అనే ముద్రపడిపోయింది. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ కూడా నెక్ట్స్ సినిమా ‘టాక్సిక్’ను ప్రకటించడానికి మూడు సంవత్సరాలు తీసుకున్నాడు. తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చిన కాదన్నాడు. ఫైనల్‌గా మలయాళ దర్శకురాలు గీతూమోహన్దాస్తో సినిమా చేస్తున్నాడు.
‘కాంతార’తో మంచి హిట్ అందుకున్నాడు రిషబ్‌శెట్టి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్ పనిలో ఉన్నాడు. ‘కాంతర’కు తెలుగులో మంచి ఆదరణలభించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ కొట్టింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిషబ్‌శెట్టి మాట్లాడుతూ, తాను కన్నడ యాక్టర్ కమ్ దర్శకుడినని, కేవలం అవకాశాలు డబ్బు, వచ్చినంత మాత్రాన పక్క ఇండస్ట్రీలకు వెళ్లనని మాట్లాడాడు. ఇది కేవలం రిషబ్ శెట్టి అభిప్రాయమే కావొచ్చు. కానీ ఆ సమయంలో అందరికీ, ముఖ్యంగా కన్నడ ప్రేక్షకులకు గుర్తు వచ్చింది మాత్రం హీరోయిన్ రష్మికా మందన్నా, దర్శకుడు ప్రశాంత్‌నీల్. కన్నడ హిట్ కిర్రిక్ పార్టీ తర్వాత రష్మికా మందన్నా ఆ భాషలో మరో సినిమా చేయలేదు. ‘సలార్’ రిలీజ్ సమయంలోనే కన్నడ నటుడు చేసిన ‘భగీర’ చిత్రం డిసెంబరు 29న విడుదలకు సిద్ధమైంది. శ్రీ మురళీ హీరో. ‘మీతో ఉగ్రం సినిమా తీసిన ప్రశాంత్‌నీల్ సినిమా సలార్:సీజ్ఫైర్’ చిత్రం డిసెంబరు 22న విడుదల అవుతుంది కాబట్టి మీరు మీ సినిమాను వాయిదా వేసుకుంటారా? అన్న ప్రశ్నకు …మాది కన్నడ సినిమా. కన్నడ ప్రేక్షకులు మా సినిమానే చూస్తారు అంటూ కాస్త ఎమోషనల్‌గా మాట్లాడారు శ్రీమురళి. ఇది కన్నడ ప్రేక్షకులను బాగా టచ్ చేసింది. పైగా…‘సలార్’ సినిమా ‘ఉగ్రం’ సినిమా లేటెస్ట్ వెర్షన్ అని ప్రశాంత్‌నీల్ చెప్పడం కూడా ‘సలార్’ కన్నడ కలెక్షన్స్‌కు కాస్త మైనస్. చూసినే సినిమానే మళ్లీ ఎందుకని వారు చూడనట్లు ఉన్నారు.
తెలుగులోకి అనువాదమై ఇటీవల వచ్చిన కన్నడ చిత్రాలు ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సప్తసాగరాలుదాటి’వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. చెప్పాలంటే ఏ భాష సినిమా అయిన కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మారథం పడతారు. కానీ ప్రభాస్ వంటి స్టార్ చేసిన ‘సలార్’ సినిమాకు కన్నడలో కలెక్షన్స్ తక్కువకావడం దేనికి సంకేతం. ఈ ప్రభావం అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాపై కూడా పడితే, భవిష్యత్‌లో రాబోయే మిగతా తెలుగు స్టార్ హీరోల సినిమాలపై కూడా ఉంటే?..పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో ఇదంతా కరెక్ట్ కాదెమో అని సగటు తెలుగు ప్రేక్షకులకు అనిపిస్తోంది. కన్నడ ప్రేక్షకుల మాదిరి, తెలుగు ప్రేక్షకులు కూడా ఆలోచిస్తే ఏంటో పరిస్థితి.